ratan-tata-telugu

చెస్ ఆట ఎలా ఆడాలి? - How to Play Chess in Telugu

చెస్ (Chess) అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందిన ఆట. చెస్ ని తెలుగులో "చదరంగం" అని అంటారు. ఇది ఇద్దరు ఆడే ఆట. చెస్ ఆడడం వలన మెదడు చురుకుగా మారుతుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు చెస్ ఆడుతూ ఉంటారు. చెస్ ఆడాలని చాలా మందికి ఉంటుంది కానీ దీనిలో ఉండే రూల్స్ వలన చెస్ నేర్చుకోవడానికి మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టికల్ లో చెస్ ఎలా ఆడాలి? ఏ ఏ పావులు ఉంటాయి? అవి ఎలా కదులుతాయి? చెస్ లో ఎటువంటి రూల్స్ ఉంటాయో వివరంగా సులువుగా తెలుసుకుందాం.


చెస్ లో నలుపు (Black), తెలుపు(White) రంగులతో మొత్తం 64 గళ్ళు ఉన్న ఒక బోర్డు ఉంటుంది. అలాగే ఈ బోర్డు మీద ఆడడానికి కొన్ని నలుపు, తెలుపు రంగులలో ఉండే 32 పావులు (Chess Pieces) ఉంటాయి. వీటిలో 16 తెల్ల పావులు, 16 నల్ల పావులు. చెస్ ని ఆడే ఇద్దరి ఆటగాళ్లలో ఒకరు తెలుపు పావులతో ఆడితే, మరొకరు నలుపు రంగు పావులతో ఆడతారు.


చెస్ ఆటలో ఉండే పావులు((Chess Pieces):

చెస్ ఆటలో రాజు (King), మంత్రి లేదా రాణి (Queen), ఏనుగులు (Rooks), గుర్రాలు (Knights), శకటాలు (Bishops), ఎనిమిది బంట్లు (Pawns) అనబడే పావులు ఉంటాయి. అలాగే ఒక్కొక్క ఆటగాడికి 16 పావులు ఉంటాయి. ఒక రాజు (King), ఒక మంత్రి లేదా రాణి (Queen), రెండు ఏనుగులు (Rooks), రెండు గుర్రాలు (Knights), రెండు శకటాలు (Bishops), ఎనిమిది బంట్లు (Pawns) ఉంటాయి.

how to play chess in telugu learn chess in telugu


చెస్ బోర్డు (Chess Board) ని ఎలా అమర్చాలి?

చెస్ బోర్డు మీద అడ్డంగా ఉన్న లైన్స్ ని ర్యాంక్స్ (Ranks) అని, నిలువుగా ఉన్న లైన్స్ ని ఫైల్స్ (Files) అని అంటారు. ఆట ఆడే వ్యక్తి కుడి చేతి వైపు క్రింద తెల్ల గడి ఉండేటట్టుగా బోర్డుని అమర్చుకోవాలి.

మన వైపు ఉన్న మొదటి ర్యాంక్ లో ఏనుగు, గుర్రం, శకటం, మంత్రి, రాజు ఉంటారు. రెండవ ర్యాంక్ లో 8 మంది బంట్లు ఉంటారు. మొదటి ర్యాంక్ లో రెండువైపులా మూల గళ్ళలో ఏనుగులు, వాటి పక్క గుర్రాలు, వాటి పక్క శకటాలు అమర్చాలి. మిగిలిన రెండు గళ్ళలో రాజు మరియు మంత్రిని అమర్చాలి. తెలుపు గడిలో తెలుపు మంత్రి ఉంటాడు, నలుపు గడిలో నలుపు మంత్రి ఉంటాడు. మిగిలిన గడిలో రాజు ఉంటాడు. మరింత బాగా అర్ధం అవ్వడం కోసం ఫోటో ని గమనించండి.

learn-chess-telugu-how-to-play-chess


పావులు ఎలా కదులుతాయి?

చెస్ లో ఒక్కొక్క పావు ఒక్కొక్క విధంగా కదులుతుంది.

రాజు (King):

రాజు ఏ వైపుకు అయినా సరే కేవలం ఒక్క గడివరకు మాత్రమే కదలగలడు. అయితే ఏ గడిలో రాజుకి ప్రమాదం ఉంటుందో ఆ గడిలోకి వెళ్ళలేడు.


మంత్రి లేదా రాణి (Queen):

చెస్ లో అత్యంత శక్తివంతమైన పావు ఇదే. క్వీన్ ఏ దిశలో అయినా ఎంత దూరం వరకు అయిన కదలగలదు.


ఏనుగు (Rook)

ఏనుగు ముందుకు, వెనుకకు, పక్కలకు ఎంత దూరం అయిన కదలగలడు.


శకటం (Bishop):

శకటం అనేది కేవలం diagonal గా మాత్రమే కదులుతుంది. అలాగే ఎంత దూరం అయినా కదలగలదు. ఏ రంగు గడిలో ఉన్న శకటం ఆ రంగు గడులలో మాత్రమే ప్రయాణిస్తుంది.


గుర్రం (Knight):

మిగిలిన వాటితో పోల్చితే గుర్రం కొంచెం విచిత్రంగా కదులుతుంది. గుర్రం L షేప్ లో మాత్రమే కదులుతుంది. గుర్రం తప్ప మరే ఇతర పావు వేరొక పావు మీద నుండి జంప్ చేయలేదు.


బంటు (Pawn):

బంటు కదిలేటప్పుడు ఒక గడి ముందుకు కదులుతాడు. కానీ చంపేటప్పుడు మాత్రం diagonal గా కదులుతాడు.ఒకవేళ బంటు కు ఎదురుగా మరొక పావు ఏదైనా ఉంటే ముందుకు కదలలేదు. బంటు మొట్టమొదటి కదిలేటప్పుడు కావాలనుకుంటే రెండు గడులు వరకు కదలవచ్చు. కానీ ఆ తరువాత నుండి కేవలం ఒక గడి మాత్రమే కదలగలడు.. అలాగే బంటు వెనక్కి కదలలేడు.



చెస్ ఆట ఎలా ఆడాలి?

చెస్ ఆటలో రాజు అత్యంత ముఖ్యమైన పావు. రాజు చనిపోతే ఆట ముగిసిపోయినట్టే. అయితే చెస్ లో అత్యంత బలహీనమైన పావు కూడా రాజే. మన రాజు ని కాపాడుకుంటూ, ప్రత్యర్థి రాజు ని చంపడమే చెస్ ఆట. దానికోసం మిగిలిన పావులతో ఆట ఆడాలి.


మొదటిగా తెల్ల పావులు ఉన్న వ్యక్తి ఆటని ప్రారంభించాలి. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఎత్తులు వేసుకుంటూ వెళ్తారు. ఒక ఎత్తులో ఒక పావుని మాత్రమే కదల్చాలి ( ఒక్క Castling లో తప్ప, దీని గురించి తరువాతి ఆర్టికల్స్ లో వివరంగా తెలుసుకుందాం.) చంపబడిన పావులు ఆట నుండి బయటకు తీసివేయబడతాయి. ప్రత్యర్థి పావుని చంపి, ఆ పావు ఉన్న గడి లో మన పావుని ని పెట్టుకోవాలి.


ప్రత్యర్థి రాజు ని చంపే ప్రయత్నం చేసినప్పుడు, ప్రత్యర్థి రాజుకి ప్రమాదం ఉన్నప్పుడు "చెక్"(Check) అవుతుంది. అప్పుడు ప్రత్యర్థి ఆ రాజుని వేరొక సురక్షితమైన గదిలోకి మార్చడం, లేదా అడ్డుగా మరొక పావుని పెట్టడం, లేదా ఏ పావు నుండి ప్రమాదం ఉందొ ఆ పావుని చంపడం చేయాలి.


చెస్ ఆట లో ముఖ్య ఉద్ద్యేశ్యం ఏమిటంటే ప్రత్యర్థి రాజుని కట్టడి చేసి ఇక తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయాలి. దీనినే చెస్ లో " చెక్ మేట్" (Checkmate) అని అంటారు. అలా చెయ్యగలిగితే మనం గెలిచినట్టే.


ఇక్కడితో అయిపోయినట్టు కాదు. చెస్ లో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. చాలా రూల్స్ ఉన్నాయి. అవన్నీ తరువాతి ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ని చెస్ నేర్చుకుందామనే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకి షేర్ చెయ్యండి.

ads
+