ratan-tata-telugu

How to set GOALS for this New Year

How to set  GOALS for this New Year?

కొత్త సంవత్సరం మొదలవుతోంది అంటే కొత్త కొత్త లక్ష్యాలతో, కొత్త సంవత్సరంలో ఏదైనా సాధించాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు.

అసలు లక్ష్యాలను ఎలా ఏర్పరుచుకోవాలి? వాటిని ఎలా సాధించాలి? లక్ష్యాలకు ఏ లక్షణాలు ఉండాలి? అసలు లక్ష్యాలు పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఇలాంటి ఆశక్తికరమయిన విషయాలు తెలుసుకుందాం..

లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటిని సాధించడం

ఒక మంచి ఫోటోని తీయడానికి కెమెరాకి లెన్స్ ని కేంద్రీకరించడం ఎంత అవసరమో, జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి లక్ష్యాలు కూడా అంతే అవసరం..

పరిజ్ఞానం అనేది మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తుంది. కానీ, మీకు మీ గమ్యం తెలిసినప్పుడే, దానిని చేరుకోవడం సాధ్యమవుతుంది.

చాలా మంది తమ జీవితాలలో లక్ష్యాలను ఏర్పరచుకోరు.

ఒక రైలు గానీ, బస్సు గానీ, విమానం గానీ, ఎక్కేముందు అది ఎక్కడికి వెళుతుందో తెలుసుకోకుండా మనం ఎక్కము కదా.. కానీ మన జీవితంలో మాత్రం ఒక లక్యం, గమ్యం అనేవి లేకుండా రోజులు గడిపేస్తూ ఉంటాం.

గాలిమాటుకి ఎగిరిపోయే గడ్డిపరకలు ఉంటాయి. అవి గాలి ఏ దిశలో వస్తే ఆ దిశలో ఎగురుపోతాయి. వాటికంటూ ఒక దిశ, ఒక ప్రయత్నం ఉండవు. గాలి ఎటు వేస్తే అవి అటు వెళ్లిపోతాయి. చాలామంది జీవితం అలానే గడిపేస్తూ ఉంటారు.

అసలు ఎక్కువమంది లక్ష్యాలు ఎందుకు ఏర్పరచుకోరు? లక్ష్యాలు ఏర్పరచుకోకపోవడానికి ఈ క్రిందివి కారణాలు అవ్వచ్చు.

1. లక్ష్యాలు ఎంత ముఖ్యమైనవో గ్రహించకపోవడం

2. తిరస్కరింప బడతామేమోనని భయం - నేను ఈ పని చెయ్యలేకపోతే, అందరూ నన్ను చూసి ఏమనుకుంటారో అని విచారపడటం.

3. వాయిదా వెయ్యడం - రేపు చేద్దాం, తరువాత వారం చేద్దాం అని వాయిదా వెయ్యడం.

4. నిరాశా వాదంతో నిండిన మనస్తత్వం - అవకాశాల కన్నా అడ్డంకులనే ఎక్కువగా వెతకడం.

5. అసలు లక్ష్యాలు ఎలా ఏర్పరచుకోవాలో తెలియకపోవడం.

చాలా మందిని మీ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని అడిగినప్పుడు "నేను ఆనందంగా ఉండాలనో, బాగా డబ్బు సంపాదించాలనో, అస్పష్టమయిన సమాధానాలు చెబుతూ ఉంటారు. అవన్నీ కోరికలే కానీ స్పష్టమైన లక్ష్యాలు కావు.

మరి లక్ష్యాలు అనేవి ఎలా ఉండాలి? ఏ లక్షణాలను కలిగి ఉండాలి?

లక్ష్యం అనేది నిర్దుష్టంగా ఉండాలి. సాధన యోగ్యంగా ఉండాలి. మనము ఎటుపోతున్నామో ముందుగా మనకి తెలియాలి. గమ్యం ఒక వైపు, ప్రయాణం మరో వైపు ఉండకూడదు. గమ్యం వైపే మన మనస్సు కేంద్రీకృతం కావాలి.

లక్ష్యాలు SMART లక్షణాలను కలిగి ఉండాలి.

S - Specific(నిర్దిష్టమయిన):

లక్ష్యం అనేది నిర్ధిష్టమయినదిగానూ, సుస్పష్టమయినదిగానూ ఉండాలి.

నా లక్ష్యం ఏమిటి?, నేను దానిని ఎందుకు సాదించాలి అనుకుంటున్నాను?, ఈ లక్ష్య సాధనలో నాకు ఎవరు సహాయపడగలరు?, లక్ష్య సాధనకు నాకు కావలసిన వనరులు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పుకోగలిగేలా ఉండగలగాలి.

ఉదాహరణకి బరువు తగ్గాలి అనేది మీ యొక్క గమ్యం అనుకుందాం.. 'నేను 90 రోజులలో 10 కేజీలు తగ్గాలి' అని అనుకుంటే అది ఒక లక్ష్యంగా మారుతుంది.

M - Measurable(కొలివగలిగేది ఉండాలి):

లక్ష్యం అనేది కొలవగలిగేదిగా ఉండాలి మరియు ఈ క్రింది ప్రశ్నలకి జవాబు ఇచ్చేదిగా ఉండాలి.

అవి ఏమిటంటే.. నేను ఎంత సాధించవలసి ఉంది?, నేను సాధించానని ఎలా తెలుసుకోగలను?

ఉందాహరణకి పలానా పరీక్షలో 500 ల లోపు ర్యాంకు సాధించాలి అనుకుంటున్నాను లాంటివి అన్నమాట.

A - Achievable(సాధించగలిగేదిగా )

లక్యం అనేది సాధించగలిగేదిగా ఉండాలి. అంటే.. నేను ఎలా సాధించగలను, నా లక్యం ఎంత వాస్తవికమయినది అనేవి ప్రశ్నించుకోగలగాలి.

ఉదాహరణకి మీరు 5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటే..జాతీయ బాస్కెట్ బాల్ పోటీలలో ఆడటం అసాధ్యం కదా.. దానికి విరుద్ధంగా ఎలాగైనా జాతీయ స్థాయిలో ఆడాలి అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది.

R - Realistic (యదార్ధమైనది)

మీరు 30 రోజులలో 50 కేజీలు తగ్గాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే అది జరిగే పని కాదు. కాబట్టి మీ లక్ష్యాలు అనేవి యదార్ధమైనవిగా నిర్ణీత సమయంలో సాధించగలిగేవిగా ఉండాలి.

T - Time Bound(నిర్ణీత కాలం)

లక్ష్య సాధనకి నిర్ణీత సమయం అనేది చాలా ముఖ్యమయినది. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మొదలుపెట్టే తేదీ, ముగించే తేదీని మీరు ముందుగా నిర్ణయించుకోవాలి. నిర్ణీత సమయం అనేది మీ దృష్టిని లక్ష్యం నుండి బయటకు మరలనివ్వకుండా చేస్తుంది.

అర్ధంలేని లక్ష్యాలతో వేలాడటం

ఒక రైతు దగ్గర ఒక కుక్క ఉండేది. అది రోడ్డు చివర కూర్చుని వచ్చే, పోయే వాహనాల కోసం ఎదురుచూస్తూ ఉండేది. ఏదైనా వాహనం రాగానే, ఆ కుక్క దాని వెంటపడి, మొరుగుతూ, ఆ వాహనంకన్నా వేగంగా పరిగెత్తాలని ప్రయత్నించేది. ఒకరోజు పొరుగింటి ఆయన 'మీ కుక్క ఎప్పటికయినా ఏ కారునైనా అందుకోగలదా' అని అడిగాడు.

దానికి ఆ యజమాని 'నా విచారం అది కాదు. ఒకవేళ ఏదోక రోజు కారుని అందుకోగలిగితే అది ఏం చేస్తుంది, అనేదే నా బాధ! దానివల్ల కుక్కకి ఏమి ప్రయోజనం? అన్నాడు రైతు.

'చాలా మంది ఆ కుక్కలానే అర్ధంలేని లక్ష్యాల వెంట పరిగెత్తుతూ ఉంటారు.'

లక్ష్యాలను ఎలా చేరుకోవాలి?

లక్ష్య సాధన కోసం మొదటిగా మనలోని అవలక్షణాలని, అలసత్వాన్ని విడవాలి.

గుర్రానికి కళ్లెం తగల్చనిదే పరిగెత్తదు, జలపాతానికి అడ్డుకట్ట వెయ్యనిదే విద్యుత్ ఉత్పాదన సాధ్యం కాదు. అదే విధంగా గమ్యాన్ని కేంద్రేకృతం చేయనిదే సత్ఫలితాలు లభించవు. మనిషి డిక్షనరీలో అసాధ్యం అనే పదం ఉండకూడదు. మనం చేయాల్సిన పనిని ఎవరో వచ్చి చేస్తారనుకోవడం పొరపాటు. మన పనిని మనమే చేసుకోవాలి. 'డిమాండ్' చేయగలవాడే 'కమాండ్' కూడా చేయగలడని గుర్తుంచుకోండి.

లక్ష్యం పెట్టుకోకపోతే ఏమవుతుంది?

ఒక లక్ష్యాన్ని పెట్టుకోకపోతే రెండు అమూల్యమయినవి పాడయిపోతాయి. ఒకటి కాలం, రెండు నీలో ఉన్న సమర్ధత. మీలో ఉన్న శక్తి నిరుపయోగం కాకుండా ఉండాలి అంటే మీరు ఒక గమ్యం అనేది ఏర్పరచుకోవాలి.

లక్ష్యం ఏర్పరచుకున్నాక, లక్ష్యం వైపుగా పని చేస్తున్నప్పుడు మనిషిని రెండు శక్తులు లాగుతాయి. ఒకటి హిత శత్రువు, రెండవది అహిత శత్రువు.

హిత శత్రువు అంటే మనకి ఇష్టమయినదిగా, మనకి దగ్గరగానే ఉంటూనే మనకి హాని తలపెట్టేది అన్నమాట.

ఉదాహరణకి మీరు ఈరోజు ఎలాగయినా ఒక పుస్తకం పూర్తి చెయ్యాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నారు అనుకుందాం.. మీరు పుస్తకం చదువుతున్నప్పుడు పక్కనే ఉన్న ఫోన్ లోని వాట్సాప్ లో మేసేజ్ వచ్చింది. ఒక మెసేజ్ నే కదా, రిప్లై ఇచ్చేసి చదుకుందామనుకుని ఫోన్ తీసుకుని మొదట వాట్సాప్, తరువాత పేస్ బుక్, యూట్యూబ్.. అలా.. అలా.. కనీసం ఒక 20 నిమిషాలయినా అలవోకగా ఫోన్ తో గడిపేస్తాం..

అందుకే.. మనిషిని ఆకర్షించి పాడుచేసే వాటివైపు మనం వశపడకూడదు. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలిగే శక్తి మీకు ఉండాలి.

ఇక అహిత శత్రువు విషయానికికొస్తే 'కొన్ని కొన్ని పాడుచేస్తాయని తెలిసి కూడా వాటికి వశపడటం'. వాటి గురించి విడిగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అవేంటో మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను.

గమ్య సాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురు రావచ్చు. ఎన్నో శక్తులు మిమ్మల్ని బలహీనపరిచవచ్చు. అయినా కూడా పట్టు విడవకుండా నిగ్రహంగా కష్టపడగలవారినే విజయం వరిస్తుంది.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+