ratan-tata-telugu

Junk Food Effects on our Body in Telugu

జంక్ ఫుడ్ (Junk Foods) తినేవారు తప్పక తెలుసుకోవలసిన విషయాలు:

'జంక్ ఫుడ్' ఈరోజుల్లో ఈ పదాన్ని వినని వారు ఈ రుచికి అలవాటు పడనివారంటూ ఎవరూ లేరు అనడం అతిశయోక్తేమీ కాదు.అసలు జంక్ ఫుడ్ అంటే ఏమిటి? ఎందుకు అందరూ 'జంక్ ఫుడ్' పై ఇంత ఆదరణ చూపిస్తున్నారు? జంక్ ఫుడ్(Junk Food) కి ఆ పేరు ఎలా వచ్చింది? జంక్ ఫుడ్ ఆరోగ్యారమా లేక ఆరోగ్యానికి హానికరమా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మొదట్లో మహానగరాల్లోకి దిగుమతైన 'జంక్ ఫుడ్' ఇప్పుడు చిన్న పట్టణాలు మరియు పల్లెటూరుల్లోకి కూడా విస్తరించింది. జంకు ఫుడ్ కు అలవాటు పడ్డ పిల్లలు వయసుకు మించిన సైజుకు పెరిగిపోతున్నారు. అసలే ఆటలకు అవకాశం లేని చదువుల భారం... ఆట మైదానాలే లేని ప్రైవేటు స్కూళ్లు... ఇక ఇళ్లకొచ్చాక టీవీలతో లేదా కంప్యూటర్లలో వీడియోగేమ్ తో కాలక్షేపం. కదలకుండా కానిచ్చే ఈ కాలక్షేపానికి తోడు నోటికి పనిచెప్పడానికి ప్లేటులో జంక్ ఫుడ్, చేతిలో కూల్‌డ్రింక్ బాటిల్... ఇదీ పరిస్థితి. భావి భారత పౌరులు కాస్తా భావి భారత భారీకాయులుగా 'ఎదుగు' తున్నారు. పొగాకు ఉత్పత్తుల మీద భయంకరమైన బొమ్మలు ముద్రించేలా చర్యలు తీసుకున్న మన ప్రభుత్వం ఫాస్టఫుడ్ ప్యాకేజీలపై ఆరోగ్య హెచ్చరికలు ముద్రించేలా చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని మాత్రం గుర్తించడం లేదు.

అసలు 'జంకు ఫుడ్' కు ఆ పేరు ఎలా వచ్చింది?

'జంక్' అంటే చెత్త. మరి 'జంక్ ఫుడ్' అంటే చెత్తతిండి. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని ఆహారాన్ని పవిత్రంగా పూజించే దేశం మనది. అలాంటి దేశంలో తిండికి చెత్త విశేషణాన్ని తగిలించడం ఎంతవరకు సమంజసం! అయితే, నానా అనర్ధాలను కొని తెచ్చే పడమటి దేశాల తిండిని చెత్తతిండి ఉరఫ్ జంక్ ఫుడ్ అనడంలో తప్పేమీ లేదని వాదించేవారు కూడా లేకపోలేదు. నాలుకకు రుచి తప్ప పదార్థంలో పనికొచ్చే పోషకాలేవీ లేకపోగా, ఒంటికి హాని చేసే ఉప్పు, చక్కెర, కొవ్వులు వంటివి మితిమీరి ఉండే ఆహారపదార్థాలనే స్టూలంగా జంక్ ఫుడ్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం.

ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందంటే..? పడమటి దేశాల్లో 1960ల కాలంలోనే ఇలాంటి తిండిని జంక్ ఫుడ్ అనడం మొదలైంది. పాప్ హోరుకు కుర్రకారు ఉర్రూతలూగే కాలంలో 'జంక్ ఫుడ్ జంకీ' అనే పాట 1976లో విపరీతంగా జనాదరణ పొందింది. అప్పటి నుంచి పిజ్జాలు, బర్గర్లు, హాట్ డాగ్స్, ఫ్రెంచ్ ప్రెస్, ఫ్రెడ్ చికెన్, ఐస్ క్రీములు, కార్బొనేటెడ్ కూల్ డ్రింకులు వంటి సమస్త పదార్థాలను 'జంక్ ఫుడ్' అనడం ప్రాచుర్యంలోకి వచ్చింది.

జంక్ ఫుడ్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు:

1. జంక్ ఫుడ్ లో మోతాదుకు మించి ఉండే కొవ్వులు నేరుగా మెదడుపై విపరీత ప్రభావాన్ని చూపుతాయి. ఒకసారి తింటే ఆ ప్రభావం రోజుల తరబడి ఉంటుంది. దానివల్ల మరింతగా తినాలనే కోరిక రేకెత్తుతుంది. ఆ కోరికను అదుపు చేసుకోవడం అంత తేలిక కాదు. దాంతో ఆకలితో నిమిత్తం లేకుండానే అతిగా తినేయడం జరుగుతుంది.

2. జంక్ ఫుడ్ తయారీ సంస్థల వ్యాపార వ్యూహాలు పిల్లలను ఈ ఉచ్చులో చిక్కుకునేలా చేస్తున్నాయి. 'క్యాచ్ దెమ్ యంగ్' అనేదే జంక్ ఫుడ్ తయారీ సంస్థల వ్యాపార సూత్రం. ఈ సంస్థలు తమ ప్రకటనల్లో 80 శాతం ప్రకటనలను వారాంతం రోజైన శనివారమే టీవీల్లో పిల్లల కార్యక్రమాలు వచ్చేటప్పుడు ప్రసారం చేస్తున్నాయి. టీవీల్లో వాటిని చూసిన పిల్లలు మారాం చేయడం, సముదాయించలేని తల్లిదండ్రులు కొనివ్వడం అసంకల్పితంగానే జరిగిపోతున్నాయి.

3. జంక్ ఫుడ్ తినే అలవాటు అమెరికాలో 1920ల నాటికే మొదలైంది. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత టీవీ ప్రకటనలు పెరగడంతో అమెరికాలో జంక్ ఫుడ్ పై జనాలకు వేలంవెర్రి పెరిగింది. జంక్ ఫుడ్ తయారీలో వాడే ప్రమాదకర రసాయనాలు నానా అనర్ధాలను కలిగిస్తాయి. ఉదాహరణకు జంకులో ఎక్కువగా వాడే సోడియం బెంజోయేట్ పిల్లల్లో అతి చురుకుదనం (హైపర్ యాక్టివిటీ) వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది.

జంక్ ఫుడ్ వళ్ళ కలిగే అనర్ధాలు:

1. స్థూలకాయం:

జంక్ ఫుడ్ లో అతిగా ఉండే కొవ్వుల వల్ల ఒంటి బరువు విపరీతంగా పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే తిప్పలు షరా మామూలే!

2. రక్తపోటు:

జంకులో ఉప్పుతో పాటు సోడియం రసాయనాలు ఎక్కువగా వాడతారు. వీటి వల్ల రక్తపోటు పెరుగుతుంది.

3. మధుమేహం:

జంక్ ఫుడ్ లో అతిగా వాడే చక్కెర, పిండి పదార్థాల వల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు తలెత్తుతుంది.

4. గుండెజబ్బులు:

జంక్ ఫుడ్ లో రుచి కోసం అతిగా వాడే కొవ్వులు రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెజబ్బులకు దారి తీస్తాయి.

జంక్ ఫుడ్ లో అతిగా ఉండే పదార్థాలు:

1. ఉప్పు:

మితంగా తింటేనే హితవు చేసే పదార్థం ఇది. జంక్ ఫుడ్ నిల్వ ఉండేందుకు ఉప్పును మితిమీరి ఉపయోగిస్తారు.

2. చక్కెర:

రుచికి తీపిగానే ఉంటుంది. అతిగా తింటే బతుకే చేదెక్కిపోతుంది. కూల్ డ్రింకులు, ఐస్ క్రీముల్లో మోతాదుకు మించి వాడతారు.

3. కొవ్వులు:

జంక్ ఫుడ్ పదార్థాలను ఎక్కువగా నూనెలో వేపుతారు. అందువల్ల అవి తింటే ఒంట్లోకి అనవసరపు కొవ్వులు చేరుతాయి.

4. పిండిపదార్థాలు:

అనవసర రసాయనాలు జంకు లో ముఖ్యమైన ముడిసరుకు పిండి పదార్థాలే. రంగు, రుచి కోసం అనవసర రసాయనాలనూ వాడతారు.

కాబట్టి ఫ్రెండ్స్ వీలైనంత వరకు 'జంక్ ఫుడ్స్' కి దూరంగా ఉండి ఇంట్లో చేసిన వంటకాలకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం మరిచిపోకండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+