ratan-tata-telugu

స్వామి వివేకానంద జీవితచరిత్ర-Swami Vivekananda Biography Telugu

Swami Vivekananda Life Story:

సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంద హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి, భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లలో బ్రతుకున్న కాలమది. అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తా లో ఉదయించాడు. భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన మొఖం , గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశ భక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద (Swami Vivekananda). కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. ఇండియాలోని యువతకు రోల్ మోడల్.

భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, దేశ భక్తుడు, మాటలతో మంత్రముగ్దులను చెయ్యగలిగే గొప్ప వక్త. బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచిన కూడా చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి మహనీయుడి గురించి, ఆయన జీవితం లో ఎదుర్కొన్న కష్టాల గురించి, భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచంమంతా ఎలా చాటారో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12 తేదీన మకర సంక్రాతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రిగారు న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర నాధ్ దత్తా.

1871 లో తన ఎనిమిదవ ఏట నరేంద్రుడు ఈశ్వర చంద్ర విద్యా సాగర్ మెట్రో పాలిటన్ పాటశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చ్యాత , తత్వ శాస్త్ర గ్రంధాలు , నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంధాలు, ఇలా ఎన్నో చదివేశాడు. అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యం అయ్యింది అని అడుగగా స్వామి వివేకానంద ఇలా అన్నారు ... నేను ఒక పేరా మొత్తం చదవను పేరాలోని మొదటి మరియు చివరి లైన్ లు చదివితే చాలు మొత్తం పేరా అంత అర్దమయ్యిపోతుంది" అంటారు.

యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనే వాడు ఒకడు ఉంటె ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూసారా ? అని అడిగేవాడు. దేవుణ్ణి చూశామని సమాధానం ఇచ్చిన వారు ఎవరూ లేరు. ఒకరోజు Scottish Church College ప్రిన్సిపాల్ అయినటువంటి విలియం హేస్టీ పాఠం చెప్తూ "పారవశ్యం" అనే పదాన్ని వివరించాలనుకుంటాడు. కానీ అది ఆయనకు సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్ధం తెలియాలంటే దక్షిణేశ్వర్ లో ఉండే శ్రీరామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. అలా ఆ పదానికి అర్ధం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్ కి వెళ్ళాడు.

అక్కడ రామకృష్ణ పరమహంస ను కూడా మీరు దేవుణ్ణి కళ్లారా చూసారా? అని అడుగుతాడు.అప్పుడు పరమహంస అవును చూసాను.!నిన్ను ఎలాచూస్తున్నానో నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశానని భగవంతుమితో మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూసాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశర్య పోయాడు.


స్వామి వివేకానంద సూక్తులు:

అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులువుగా నమ్మేవాడు కాదు. తనకు తానూ ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దేనిని నమ్మడు . అప్పుడు నరేంద్రుడు అయితే నాకు కూడా దేవునికి చూపించండి అంటాడు. అప్పుడు రామకృష్ణులు ఆయన కాలును మెల్లగా నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నారు ? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. ఇలా రామకృష్ణుల సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చూసాడు.

దానితో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా చేరాడు. ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచాడు. 1884లో బి.ఎ పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నరేంద్రుడి తండ్రి గారు మరణిచారనే వార్త తెలుస్తుంది. తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అప్పులిచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గరి బంధువులు కలిసి నరేంద్రుడి ఆస్తులను లాక్కుంటారు. ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టడంకోసం ఉద్యోగం కోసం వెతుకుంటూ ఉండేవాడు. కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడు. ఇంటికి వచ్చిన తరువాత తాను స్నేహితుల ఇంట్లో తిన్నానని అబద్దం చెప్పి తన కోసం ఉంచిన ఆహారాన్ని చెల్లెలకు ఇచ్చేసేవాడు. ఉద్యోగం కోసం తిరుగుతూ ఆకలితో ఎన్నో సార్లు కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేవాడు.

చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. కొంతకాలానికి రామకృష్ణ పరమహంస కు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువు గారికి సేవ చెయ్యనికి వెళ్ళిపోయాడు. కానీ 1886 లో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉండేవారు. వాళ్ళకి నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు.

కొంతకాలం తరువాత వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నారు. భారతదేశమంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూసారు.ఆ సమయంలో పేదవాళ్ళ పరిస్థితి చూసి చలించిపోయారు. భారత దేశం బానిసత్వం లో మగ్గిపోవడానికి, మూఢనమ్మకాలే కారణమని గుర్తించారు. భారతదేశంలోని వివిధ మతాలను వాటి తత్వాలలను అర్ధం చేసుకున్నారు.

భారతీయ ఆద్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలనుకున్నారు. అలా దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ సముద్రంలో కొంత దూరంలో కనపడుతున్న ఒక చిన్న కొండ లాంటి ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ మూడు రోజుల పాటు ధ్యానం చేసారు. ఆ ధ్యానంలో తాను ఇన్ని రోజుల నుండి చుసిన వాటిని స్పృష్టంగా అర్ధం చేసుకున్నారు.

పాశాత్య దేశాలకు వెళ్లి భారతదేశపు గొప్పతన్నాని చాటాలని అలాగే తిరిగి వచ్చిన తరువాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొలపాలని నిర్ణయించుకున్నారు.

అయితే చికాగో లో జరగబోయే సర్వమత మహా సభలకు వెళ్లాలని, అక్కడ భారతదేశ గొప్పతన్నాని, ఆధ్యాత్మికను చాటి చెప్పాలనుకున్నారు. అయితే విదేశాలకు వెళ్ళడానికి కావలసిన డబ్బును కొంతమంది మహారాజులు సమకూర్చారు. దేశ నలుమూల నుండి ఎంతో మంది విరాళాలు పంపారు. అలా 1893 వ సంవత్సరం మే 31వ తేదీన బొంబాయి తీరం నుండి ఒక నౌక లో ఆయన బయలుదేరారు. జులై నెలలో ఆయన చికాగో చేరుకున్నారు. అయితే అక్కడకి వెళ్ళాక తెలిసింది సర్వ మత మహా సభలు 3 నెలలకు వాయిదా పడ్డాయని.

స్వామిజికి చికాగో లో ఎవరూ తెలియదు. అలా వీధులలో తిరుగుతూ ఉండేవారు ఆయన వేషధారనను అందరూ వింతగా చూసేవారు . కొంతమంది అపహాస్యం చేసేవారు. అలా ఒకసారి స్వామిజి చికాగో లో నడుస్తున్న సమయంలో ఒకామె వాళ్ళ భర్తతో "చూడండి. ఆయన బట్టలు ఎలా ఉన్నాయో.! అసలు జెంటిల్ మ్యాన్ లా లేడు" అంటూ స్వామిజి ని అపహాస్యం చేస్తుంది . అప్పడు స్వామిజి "చుడండి మేడం.! మీ దేశంలో ఒక మనిషిని టైలర్ జెంటిల్ మ్యాన్ గా మార్చుతారేమో,కానీ మా దేశంలో క్యారక్టర్ జెంటిల్ మ్యాన్ గా మారుస్తుంది. అని సమాధానమిచ్చారు.

అక్కడ చికాగోలో ఎన్నో కష్టాలు పడ్డారు. అన్ని రోజుల పాటు ఉండాలంటే చికాగో ఖరీదైన నగరం . ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులలో ఆయనకు కేథరిన్ అనే ఒక మహిళ పరిచయమయ్యింది. ఆమె స్వామిజితో మాట్లాడిన కొంత సేపటికే ఆయన గొప్పతనం తెలుసుకుని బోస్టన్ నగరంలో ఉండే తన ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది. దానికి స్వామిజీ ఒప్పుకుని ఆ ఇంట్లో ఉండేవారు.

ఆ సమయంలో వివేకానంద ఖాళీగా ఉన్న సమయంలో లైబ్రరి కి వెళ్లి ఒక పుస్తకము తీసుకుని వెళ్లి తరువాత రోజు ఇచ్చేసేవారు అలా చాలా రోజుల పాటు రోజుకొక పుస్తకం తీసుకువెళ్లడం తరువాత రోజు తిరిగి ఇచ్చేయడం జరిగేది. ఒకరోజు ఆ లైబ్రరీ లో అధికారికి కోపమొచ్చి చదవని దానికి ఎందుకు తీసుకువెళ్లడం?. అని స్వామిజి మీద కోప్పడతుంది. అప్పుడు స్వామిజి చదవడం లేదని ఎవరన్నారు?. కావాలంటే ఇప్పటి వరకు నేను తీసుకు వెళ్లిన పుస్తకాలలో ఏదో ఒక ప్రశ్న అడగండి అని అంటారు. అప్పుడు ఆమె ఒక పుస్తకం తీసి ఏ ప్రశ్న అడిగినా అక్కడ పుస్తకం లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేవారు. అంతటి జ్ఞాపకశక్తి ఆయనది.

బోస్టన్ లో కేథరిన్ ఇంట్లో ఉంటున్న సమయంలో స్వామిజి కి J.H Right అనే ఒక ప్రొఫసర్ తో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు స్వామిజి ఆ ప్రొఫషర్ ని విశ్వమత మహా సభల్లో మాట్లాడానికి తనకి అనుమతి ఇప్పంచిమని అడుగుతారు. అప్పుడు ఆ ప్రొఫషర్ విశ్వమత సభలను నిర్వహించే వాళ్లకు ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో ఇలా రాస్తారు. ఈ అమెరికాలోని పండితులను మేధావులను, అందరికి ఒక వైపు కూర్చోపెట్టి ఈ వివేకానందను ఒకవైపు కుర్చోపెట్టినా కూడా ఈ స్వామిజి మేధస్సుకు, స్థాయికి వాళ్ళు సరిపోరని ఆయన ఆ ఉత్తరంలో పేర్కొంటారు.

అలా సర్వ మత మహా సభలు 1893 సంవత్సరం సెప్టెంబర్ 11 న తేదీన ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ.. సూటు బూట్లతో రెడీ అయ్యి ఉంటారు. కానీ వివేకానంద దుస్తులు, వేషధారణ చూసి ఆయన్ని ఎవరూ కూడా గౌరవించలేదు. చులకనగా చూస్తారు. సభలో ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు. చివరగా స్వామి వివేకానంద వంతు రానే వచ్చింది. స్వామిజి నిల్చుని గంభీరమైన గొంతుతో " Sisters and brothers of America " "అమెరికా దేశపు సోదర సోదరీ మణులారా" అని పలకరించే సరికి ఆ ఒక్క పిలుపికి సభలో ఉన్న 4000 మందికి పైగా జనం లేచి 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట. అప్పటి వరకు అందరు "లేడీస్ అండ్ జెంటిల్ మెన్" అంటూ స్పీచ్ మొదలు పెట్టారు కానీ వివేకానంద సోదర సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ పిలుపులో ఆత్మీయత వాళ్ళ హృదయాలను తాకింది. ఏ స్వార్థం లేని పిలుపుకి కొంతమంది కన్నీరు కూడా కార్చారు. ఆ చప్పట్ల శబ్దం ఆగిన తరువాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి మన దేశంలో ఆధ్యాత్మికత, సనాతన దర్మం, సంసృతి, సంప్రదాయాల గురించి ప్రసంగించారు. దానితో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సభలో ఉన్న మేధావులు, గొప్ప గొప్ప వాళ్లంతా తమ స్థాయిని కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లా ఎగబడుతూ స్టేజి వద్దకు వచ్చి స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

తరువాత రోజు చికాగో లో వార్త పత్రికల్లాంటిలోను ఫ్రంట్ పేజీలో స్వామిజి ఫోటో లే, ఆయన ప్రసంగాన్నే ప్రముఖంగా ప్రచురించాయి. అన్ని న్యూస్ పేపర్ లు కూడా ఆయనని “cyclonic monk from India”. అని పేర్కొన్నాయి ఏకంగా ఒక చికాగో పత్రిక అయితే "ఇటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం" అని వ్యాఖ్యానించింది.

ఇలా కేవలం చికాగోలోనే కాదు ప్రపంచంతా ఈ భారతీయ సన్యాసి గురించి మారు మోగిపోయింది. అక్కడ ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. కొంతమంది ఆయనకి శిష్యులుగా మారిపోయారు కూడా.

అప్పటి వరకు భారత దేశం అంటే, మూఢ నమ్మకాలతో, చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్లందరికీ భారత దేశం పట్ల ఉన్న అపోహలను తొలగించారు. గౌరవం కలిగేలా చేసారు. భారత దేశపు స్థాయిని పెంచారు. ఈ విశ్వ మత సభలు కొన్ని రోజుల పాటు జరిగాయి. ప్రతి రోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివర్లో ఉంచేవారు. ఎందుకంటే సభలో జనమంతా కూడా చివర్లో ఉండే వివేకానంద స్పీచ్ కోసం ఆ సభ చివరి వరకు ఉండేవారట. అదే స్వామిజి స్పీచ్ ముందే పెడితే ఆయన స్పీచ్ అయిన వెంటనే లేచి వెళ్ళిపోయేవారు.

ఒక్కరోజులోనే చికాగో నగరమంతా స్వామిజి కీర్తితో నిండిపోయింది. ఇతనిని ఇలా వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదమని కొంతమంది ఈయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ఈయనను చంపడానికి కూడా ప్రయత్నించారు. అలాగే ఒకసారి స్వామిజి ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో ఈయన అంటే పడని ఒక వ్యక్తి ఒక పేపర్ మీద "ఇడియట్" అని రాసి స్వామిజి మీదకు విసిరాడు. అప్పుడు స్వామిజి అది తెరిచి చదివి ఇలా అన్నారు . "పాపం ఎవరో వాళ్ళ పేరు రాసారు కానీ మేటర్ రాయడం మర్చిపోయారు అని" అలా ఉండేది. ఆయన సమయస్ఫూర్తి.

ఈయన అంటే పడని వాళ్ళు ఆయనను చులకన చేయడానికి ప్రయత్నించేవారు. ఒకసారి ఆయన చికాగో లో ఉన్నపుడు కొన్ని మతాల వారు స్వామిజిని ఎగతాళి చెయ్యడానికి వాళ్ళ లైబ్రరికి తీసుకువెళ్లారు. అక్కడ అన్ని మత గ్రంధాలు ఒకదానిమీద ఒకటి వరుసలో పెట్టి అన్నిటికన్నా కింద భగవద్గీతను పెట్టారు. అప్పుడు అందులో ఒక వ్యక్తి చూసావా? వివేకానంద మీ భారతదేశానికి చెందిన భగవద్గీతను అన్నిటికన్నా కింద ఉంది. అది మీ స్థానం అని ఎగతాళి చేస్తారు. అప్పుడు స్వామిజి నవ్వుతూ మీరు సరిగ్గానే అమర్చారు. భగవద్గీతే అన్ని మత గ్రంధాలకు ఆధారం. ఒకవేళ కింద ఉన్న భగవద్గీతను తీసేస్తే అన్ని గ్రంధాలు పడిపోతాయి. మీరు భగవద్గీతను ముందుగా కింద పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంధం ఇదే అని మీరే ఒప్పుకున్నట్టు కదా.! అని అన్నారు. ఆ మాటకి వాళ్ళు సిగ్గుతో తల దించుకున్నారు.

అలాగే మరొక సారి ఈయన అమెరికాలో ఒక ట్రైన్ లో ప్రయాణిస్తున్నపుడు కొంతమంది అమ్మాయిలు స్వామిజి వేషధారణ చూసి ఆయన్ని ఆటపట్టించాలనుకుంటారు .ఆ అమ్మాయిలు స్వామిజి దగ్గరకు వచ్చి తన దగ్గరున్న వస్తువులను ఇవ్వమని లేదంటే అదే బోగీలో ఉన్న పోలీస్ కి మమ్మల్ని ఏడిపిస్తున్నావని కంప్లైంట్ చేస్తామని స్వామిజిని బెదిరిస్తారు. అప్పుడు స్వామిజి తనకి వినపడదని మీరు ఏమంటున్నారో ఒక పేపర్ మీద రాయమని సైగ చేసారు. అప్పుడు ఆ అమ్మాయిలు ఒక పేపర్ మీద " నీ దగ్గర ఉన్న డబ్బుని యివ్వకపోతే మమ్మల్ని ఏడిపిస్తున్నావని పోలీస్ కి కంప్లైంట్ చేస్తాము" అని ఒక పేపర్ మీద రాసి స్వామీజీకి ఇస్తారు . అప్పుడు స్వామిజి "సరే ఇప్పుడు పిలవండి పోలీసులను" అని అంటారు ఇక చేసేదేమి లేక ఆ అమ్మాయిలు తల దించుకుని వెళ్ళిపోతారు.

మరొక వైపు వివేకానందుని ఖ్యాతి అన్ని దేశాలకు పాకేసింది. ఈయనకు ఇంగ్లాండ్ నుండి కూడా తమ దేశానికి రమ్మని ఆహ్వానాలు వస్తాయి అలా ఆయన అమెరికా నుండి ఇంగ్లాండ్ కి ప్రయాణమయ్యారు . ఒకసారి స్వామిజి మరియు అతని మిత్రుడు కలిసి ఒక షిప్ లో కలిసి ప్రయాణిస్తున్నారు. అప్పుడు వీరు ఆ షిప్ సిబ్బంది ని చదవడానికి న్యూస్ పేపర్ ఇమ్మని అడుగుతారు. ఆ షిప్ సిబ్బంది న్యూస్ పేపర్ ఇస్తారు ఆ న్యూస్ పేపర్ ని ముందుగా స్వామిజి చదివిన తరువాత ఆయన మిత్రుడు తీసుకుని చదువుతూ ఉండంగా ఒక్కసారిగా పెద్ద గాలి వీయడంతో ఆ న్యూస్ పేపర్ ఎగిరి సముద్రం లో పడిపోతుంది. అప్పుడు ఆ షిప్ సిబ్బంది వచ్చి స్వామిజి మిత్రుడిని విపరీతంగా తిట్టడం మొదలుపెడతారు. అది చూసిన స్వామిజి ఆ షిప్ సిబ్బందిని ఆపి ఒక పేపర్ మరియు పెన్ అడిగి తీసుకుని మొత్తం ఆ న్యూస్ పేపర్ లో న్యూస్ అంతటిని ఉన్నది ఉన్నట్టుగా రాసి వాళ్లకు ఇస్తూ " తీసుకోండి ఆ న్యూస్ పేపర్ లో ఉన్న మేటర్ ఇదే. కావాలంటే చెక్ చేసుకోండి" అని ఆ సిబ్బందికి ఇచ్చారు. దానితో అక్కడున్న వాళ్లందరు ఆశర్యపోక తప్పలేదు . ఇంగ్లాండ్ కి చేరుకున్న తరువాత అక్కడ కూడా భారతదేశం ఔనత్యాన్ని చాటి చెప్పారు . ఈయన ఏ దేశమా వెళ్లిన సరే "ఎవరో భారత దేశం నుండి వచ్చిన గొప్ప సన్యాసి అట" అని ఆయనను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు .

ఒకసారి బ్రిటిష్ అధికారి వివేకానందను లంచ్ కోసం తన ఇంటికి ఆహ్వానిస్తారు. లంచ్ చేస్తున్న సమయంలో ఆ అధికారి స్పూన్ తో తింటారు. కానీ వివేకానంద చేతులతో తింటూ ఉంటారు. అప్పుడు ఆ అధికారి నవ్వుతూ "ఈ రోజుల్లో కూడా మీ భారతీయులు ఇంకా చేతితో తింటారేంటి" అని అడుగుతాడట. అప్పుడు స్వామిజి "ఇప్పుడు మీరు తింటున్న స్పూన్ లతో ఎంతో మంది తిని ఉండవచ్చు. కానీ నా చేతులతో నేను తప్ప మరొకరు తినలేదు" అన్నారు. అంతే ఆ అధికారి తన చేతిలో ఉన్న స్పూన్ల ను ప్లేట్ లో వదిలేసారట.

అలాగే మరొకసారి ఒక బ్రిటీష్ ఆఫీసర్ మరియు స్వామి వివేకానంద కలిసి ఒక ట్రైన్ లో ప్రయాణిస్తుంటారు. ఆ కంపార్ట్మెంట్ లో కేవలం వీరిద్దరే ఉన్నారు. స్వామిజి వేషధారణ చూసి ఆయనకు ఇంగ్లీష్ రాదనుకుని స్వామిజిని అపహాస్యం చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తరువాత స్వామిజి నిద్రపోయారు. ఆ సమయంలో ఆ బ్రిటిష్ ఆఫీసర్ వివేకానంద షూస్ ని తీసి కిటికీ నుండి బయటకు విసిరేశాడు. వివేకానంద నిద్ర లేచి చూసేసరికి ఆయన షూస్ కనపడలేదు. స్వామిజికి అంతా అర్ధమయ్యింది. కానీ ఏమి మాట్లాడకుండా స్వామిజి నిశ్శబ్దంగా ఉన్నారు. కొంత సేపు గడిచాక ఈ బ్రిటిష్ ఆఫీసర్ నిద్రపోయాడు. కొంతసేపటి తరువాత ఆఫీసర్ లేచి చుస్తే హేంగర్ కి తగిలించి ఉండవలసిన తన కోట్ కనిపించలేదు. అప్పుడు ఆ ఆఫీసర్ నా కోట్ ఏది? అని స్వామి వివేకానంద ని అడిగితె అప్పుడు స్వామిజి "నీ కోట్ ని నా షూస్ ని వెతకడానికి వెళ్ళింది " అని సమాధానమిచ్చారు

ఇదిలా ఉండగా వివేకానందుడిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించిన హార్వర్డ్‌ యూనివర్సిటీ తమ విశ్వ విద్యాలయంలో ఆసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని, దానికి డైరెక్టర్‌గా ఉండాలని స్వామీజిని కోరారు. ఇలాగె మరెన్నో గొప్ప గొప్ప అవకాశాలు కూడా వివేకానందుడికి వచ్చాయి . కానీ వాటన్నింటినీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.

అలా నాలుగు సంవత్సరాల పాటు విదేశాలలో పర్యటించి తిరిగి భారత దేశానికి ప్రయాణమవుతుండగా ఎంతో మంది విదేశీయులు స్వామిజి తో మేము కూడా ఇండియా కి వస్తామని హైందవ మతం లో చేరుతామని అడుగుతారు. కానీ స్వామిజి తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా , ఒక మహ్మదీయుడు మంచి మహ్మదీయుడిగా ఉండే చాలని చెప్తారు. భగవంతుడిని చేరుకోవడానికి ఈ మతాలనేవి రకరకాల దారులని మనం ఏ దారిలో వెళ్లిన మనమందరం ఒకే చోట ఆ భగవంతుడిని కలుసుకుంటామని ఆయనచెప్పారు. ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు .ఒకసారి ఆయన జీసస్ గురించి మాట్లాడుతూ

"క్రీస్తు చూపించిన ప్రేమ మార్గానికి క్రీస్తు ఉన్న సమయంలో నేను కనుక పాలస్తీనాలో ఉండి ఉంటె నేను నా కన్నీటితో కాదు నా రక్తం తో ఆయన పాదాలు కడిగే వాడినని" అన్నారు.

అలా ఆయన భారత దేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే భారతదేశంలో స్వామిజి ఘనత దశదిశలా వ్యాపించింది. 1897 లో కొలంబో కి ఆయన చేరుకోగానే ఒక మహారాజుకి లభించినంత గౌరవ మర్యాదలు లభించాయి. తాము ఎప్పటికి బానిసలమే అనే నిరాశతో నిండిపోయిన కోట్ల మంది భారతీయుల హృదయాలు స్వామి వివేకానందని చూసి ఆత్మ విశ్వాసంతో నిండిపోయాయి. ఇండియాకి వచ్చిన తరువాత నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దాని ప్రధాన లక్ష్యం దేశంలోని పేద మరియు అనారోగ్య ప్రజలకు సేవలు అందించడం. ఇప్పుడు ఈ సంస్ద కేవలం మన దేశం లోనే కాదు ప్రపంచం వ్యాప్తంగా విస్తరించింది ఎన్నో పాఠశాలు ఆసుపత్రులు నిర్మించి సేవ చేస్తుంది. యువతకు మార్గనిర్దేశం చేయడంలో విశేష కృషి చేస్తోంది.

ఆ తరువాత కూడా చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ, రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడం వలన ఆయన ఆరోగ్యం దెబ్బ తినడం మొదలు పెట్టింది. ఒకరోజు స్వామిజి ఆయన శిష్యులలో ఒకరిని పంచాంగ తీసుకురమ్మన్నారు. దానిలో జులై 4 తేదీ శుక్రవారం మంచి రోజుగా గుర్తించి మార్క్ చేసారు. కానీ అది దేనికో ఆ శిష్యులకు అర్ధం కాలేదు.

కానీ ఆ రోజు రానే వచ్చింది 1902 సంవత్సరం జులై 4 తేదీన రాత్రి 9 గంటల సమయంలో కొంత సేపు ధ్యానం చేసుకున్నారు. తరువాత మంచం మీద పడుకుని ఆయన తన శ్వాస ని విడిచారు. అలా తాను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన.

ఆయన కేవలం తన శరీరాన్ని అయితే వదిలారు కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయులలో ఎప్పటికి నిలిచేఉంటుంది. ఆయన తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల మధ్య ఒక వారధి నిర్మించారు. ఇండియాకి ప్రపంచ దేశాల్లో గౌరవం తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం మొత్తం మీద తనకంటూ చేసుకున్నది, దాచుకున్నది ఏది లేదు. ఆయన విదేశాలలో ఎలాంటి ముద్ర వేశారంటే ఇప్పటికి అమెరికాలో ఒక వీధికి "స్వామి వివేకానంద స్ట్రీట్" అని పేరు పెట్టుకున్నారు

మహాత్మా గాంధీ , సుభాష్ చంద్రబోస్, తిలక్, బిపిన్ చంద్ర పాల్ వంటి ఎంతోమంది స్వాతంత్ర యోధులకు వివేకానందుడే ఆదర్శం. . "మీరు ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద గురించి చదవండి" అంటారు టాగోర్.

ముఖ్యంగా యువతకోసం ఆయన ఎంతో తపించారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని. యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు. అందుకే "డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు అంటారు"వివేకానంద. ఆయన ఎప్పుడు కూడా "గొర్రెలలా కాదు సింహంలా ధైరంగా బ్రతకమని" దేనికి భయపడవద్దని అంటారు

”ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను” అని స్వామీజీ తరచూ అనేవారు.

మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపినవారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి 12 ను "నేషనల్ యూత్ డే" గా జరుపుకుంటారు. ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో పుస్తకాలతో, యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు. జీవితం నిరాశ నిస్పృహలతో నిండిపోయినప్పుడు, భయ భ్రాంతులకు గురైనపుడు, మనసు చెడు మార్గాలవైపు మళ్ళి ఏమిచెయ్యాలో దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నపుడు ఒక్కసారి స్వామి వివేకానందకి సంబందించిన పుస్తకాలు, సూక్తులను చదవండి. వివేకానందుడి సందేశాలు సూటిగా మన హృదయాన్ని తాకుతాయి. మనసులో ఒక తెలియని ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగుతుంది. జీవితానికి అసలైన అర్ధం తెలుస్తుంది. నిద్రానమై ఉన్న భారతజాతిని మేల్కొలిపిన ఆ మహనీయుడు, యుగ పురుషుడు ఎప్పటికి మన గుండెల్లో నిలిచే ఉంటారు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+